Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీద్ రాష్ట్రంలో రూ.1,600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. దుబాయ్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో తబ్రీద్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సమావేశంలో తబ్రీద్ సంస్థ సీఈవో ఖలీద్ అల్ మర్జుకి ప్రతినిధి బృందంతోపాటు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ ఫార్మాసిటీ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం తబ్రీద్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ ఫార్మాసిటీతోపాటు తెలంగాణలోని పారిశ్రామిక పారుల అవసరాల మేరకు కూలింగ్ శీతలీకరణ మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నది. ఇందులో భాగంగా సంస్థ 1.25 లక్షల టన్నుల రిఫ్రిజిరేషన్ కూలింగ్ మౌలిక వసతులను తెలంగాణలో అభివృద్ధి చేస్తుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్ కానునున్నది.
తబ్రీద్ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్ట్ వలన బహుముఖ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాల మేరకు దాదాపు 6,800 గిగావాట్ల కరెంటుతోపాటు 41,600 మెగాలీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా 24 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. దీంతో సుదీర్ఘకాలంలో హైదరాబాద్ నగరంలో కాలుష్యం, ఉష్ణోగ్రతలు తగ్గి అత్యుత్తమ నగరాలకు కావలసిన అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని తబ్రీద్ సంస్థ వ్యక్తం చేసింది. ఈ లక్ష్యం పూర్తయితే ఆసియా ఖండంలోనే జీవించేందుకు, పని చేసేందుకు అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవనున్నది. ప్రభుత్వం తబ్రీద్ సంస్థతో కలిసి చేపడుతున్న ఈ ప్రాజెక్టు వలన ముఖ్యంగా ఫార్మా రంగంలోని బల్‌డ్రగ్ తయారీ కేంద్రాలకు స్వచ్ఛమైన పర్యావరణ పరిషారాలు లభించే అవకాశం ఏర్పడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సస్టెయినబుల్ కూలింగ్ విధానంపై యూఎన్ పర్యావరణ కార్యక్రమం ఇండియా హెడ్ అతుల్ బగాయి ప్రశంసలు కురిపించారు. సీవోపీ-28 ద్వారా అంతర్జాతీయ కూలింగ్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా ప్రపంచ దేశాలు అత్యుత్తమ కూలింగ్ విధానాల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించుకునేలా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని వివరించారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. తెలంగాణలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార, వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సుస్థిర భవిష్యత్తు కోసం తబ్రీద్ సంస్థతో కుదిరిన అవగాహన ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ.. వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులు, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా అమలు చేసేందుకు వీలైన డిస్ట్రిక్ట్ కూలింగ్ ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్, తకువ విద్యుత్తు శక్తిని ఉపయోగించుకునే కూలింగ్ సొల్యూషన్స్, కూల్‌రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా తెలంగాణ 2047 నాటికి నెట్‌జీరో లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే కాకుండా భారతదేశ సస్టయినబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తబ్రీద్ సంస్థ చైర్మన్ ఖాలిద్ అబ్దుల్లా అల్ ఖుబాసీ తెలిపారు. తమ సంస్థకు డిస్ట్రిక్ట్ కూలింగ్ రంగంలో ఉన్న అపారమైన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీతోపాటు తెలంగాణలోని ఇతర పారిశ్రామిక పారులు, వాణిజ్య ప్రాంతాలకు అవసరమైన అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూలింగ్ టెక్నాలజీలను అందిస్తామని తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలు కలిగించే కాలుష్యానికి ప్రధాన కారణం అవి వాడే కూలింగ్ టెక్నాలజీలేనని, వాటి ద్వారానే భారీ ఎత్తున కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం మేరకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి కూలింగ్ పరిషారాలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా నెట్‌జీరో ఉద్గారాల విషయంలో తెలంగాణ తన లక్ష్యాన్ని అందుకుంటుందున్న ఆశాభావం వ్యక్తంచేశారు. తమ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఖుబాసీ ధన్యవాదాలు తెలియజేశారు.