హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించింది. వరి, మిరప, పసుపు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ద్వారా దేశీయ అవసరాలతోపాటు విదేశాలకు ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు పలు బడా కంపెనీలు గత సంవత్సర కాలంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టడం.. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలకున్న అవకాశాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ పెట్టుబడులతో 20వేల మందికి ఉద్యోగావకాశాలూ లభిస్తాయని అంచనా.
ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్ల ఏర్పాటు
ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నూతన ఆహారశుద్ధి విధానాన్ని ప్రవేశపెట్టి 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా కనీసం 10 వేల ఎకరాల్లో ఆహారశుద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తున్నది. 1,460కిపైగా దరఖాస్తులు రావడంతో అర్హులను ఎంపికచేసి భూముల కేటాయింపు చేపట్టారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు గోదాములు, ఎగుమతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.