యువతకు ఉద్యోగాలు రావాలి.. అందుకు కంపెనీలు రావాలి.. పెట్టుబడులు పెట్టాలి.. అందుకు సులభతర వ్యాపారం చేసే సుహృద్భావ వాతావరణం ఉండాలి.. అలాంటి వాతావరణం కల్పించి ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.45 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్ సర్కారు కల్పించిన మౌలిక సదుపాయాలు, రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలతో కంపెనీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలతో ఈ ఏడాది రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. రూ.45,190 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయి. వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 70,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. బహుశా దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదంటే అతిశయోక్తి కాదు.

టీఎస్ఐపాస్ ఫలితమే
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా సులభతర అనుమతులు కల్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలతో భూములను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. మరే ఇతర రాష్ట్రంలో లేనంతగా రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పించింది. ముఖ్యంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా నిర్వహించిన అమెరికా, స్విట్జర్లాండ్ పర్యటనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
ప్రముఖ స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించింది. గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ 30 శాతం మార్కెట్ వాటాతో దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ కావడం విశేషం. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 2,200, పరోక్షంగా 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రూ.250 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటుచేయగా, సంవత్సరానికి 1.25 మిలియన్ల గుండె స్టంట్లు తయారుచేసే సామర్థ్యం ఉన్నది
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిమెడ్ (మెయిల్) అనుబంధ డ్రిల్మెక్ స్పా (ఇటలీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయిల్ రిగ్స్తోపాటు అనుబంధ పరికరాల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మేఘా సంస్థ ప్రభుత్వ పరిశ్రమల శాఖతో ఒప్పందం చేసుకోనున్నది.
జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ కెనడాకు చెందిన ప్రముఖ జనరిక్ ఔషధాల తయారీ సంస్థ జాంప్ ఫార్మాస్యూటికల్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించారు. కెనడా వెలుపల ఏర్పాటైన జాంప్ మొదటి సంస్థ ఇదే కావడం విశేషం. మాత్రలు, పొడులు, లిక్విడ్ రూపంలో నోటి ద్వారా, ముక్కు ద్వారా తీసుకొనే మందులను ఇక్కడ తయారు చేయనున్నారు.
ప్రతిష్ఠాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీ పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ కలిసి పనిచేయనున్నది.
రాష్ట్రంలో రైల్ కోచ్‌లను తయారుచేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థ స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. ఈ మేరకు దావోస్‌లో మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే రెండేండ్లలో తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది.
పరిశ్రమల శాఖకు దక్కిన అవార్డులు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమ ప్రతిభకుగానూ తెలంగాణకు ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఎకనామిక్ టైమ్స్ అవార్డు దక్కింది. ఆగస్టు 25న ఢిల్లీలో జరిగిన ది డిజి టెక్ కాన్క్లేవ్-2022 సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో వరుసగా 2018, 2020, 2022 సంవత్సరాల్లో బెస్ట్ స్టేట్ అవార్డులు గెలుచుకొన్నది. కొవిడ్ సంక్షోభం నుంచి వేగంగా కోలుకొని తయారీ రంగాన్ని గాడిలో పెట్టడం విశేషం. తెలంగాణకు చెందిన హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, నల్ల గొర్రెల గొంగడికి యునెస్కో విశిష్ట చేనేత సంప్రదాయ వస్ర్తాల గుర్తింపు లభించింది.
ప్రముఖ డిజిటల్ టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్ కేంద్రంగా భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. భారత్‌లో గ్రిడ్ డైనమిక్స్ తొలిసారిగా తమ సేవలను ఇక్కడి నుంచే ప్రారంభించగా, ఈ ఏడాది చివరికల్లా 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ కోకాపేట్లో జీసీసీ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 450 మందికి ఉద్యోగాలు లభించాయి.
