హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): టీ-హబ్‌లో తెలంగాణ ఇన్నోవేషన్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ (తెలంగాణ) ఇన్నోవేషన్ మహోత్సవాన్ని జరిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ కల్చర్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించిందన్నారు. సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గ్రామీణ స్థాయిలో ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు రంగాలవారీగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీ-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు, తెలంగాణ స్టేట్ సీఐవో డాక్టర్ శాంతా తౌటం, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, వి-హబ్ సీఈవో దీప్తి రావుల, రిచ్ సీఈవో రష్మీ పింపేల్, టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరిలతోపాటు స్టార్టప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
నగదు బహుమతులు
టీఎస్ఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ (టీఎస్ఐఆర్ఐ) కార్యక్రమానికి 136 స్టార్టప్‌లు, ఇన్నోవేటర్ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 6 స్టార్టప్‌లు, 12 మంది ఇన్నోవేటర్లను ఎంపిక చేశారు. వీరికి చెక్కులు పంపిణీ చేశారు. నయా ఆవిష్కరణల కోసమే ఈ కార్యక్రమాన్ని తెచ్చారు.