హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారిందని, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలోనూ అద్భుతమైన పురోగతిని సాధించినట్లు తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్ (టీ-ఎయిమ్) సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగ డైరెక్టర్ రమాదేవి లంక, నాస్కామ్ ప్రతినిధులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏఐ పురోగతిపై నివేదికను విడుదల చేశారు.
టెక్నాలజీ రంగంలో యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐతో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను చేపట్టారు. ఏఐతో అత్యాధునిక పరిశోధనలు చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసి మెరుగైన ఫలితాలను సాధించామని జయేశ్ రంజన్ తెలిపారు. ఇందులో ప్రధానంగా సెల్పీ ద్వారా పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ ప్రమాణీకరణ,రోడ్లపై గుంతలను గుర్తించడం, మ్యాపింగ్ వంటి ప్రాజెక్టులను ఏఐ టెక్నాలజీ చేపట్టి మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. టీ-ఎయిర్ నేతృత్వంలో గ్రాండ్ చాలెంజ్ కార్యక్రమాన్ని పలు దఫాలుగా నిర్వహించామని,ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఇప్పటికే ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి ఏఐ టెక్నాలజీ వాడామని తెలిపారు.
అంతర్జాతీయంగానూ తెలంగాణ..
సై మ్యాగో ఇనిస్టిట్యూషన్ ర్యాంకింగ్స్ ప్రకారం కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధనలో ప్రపంచ వ్యాప్తంగా 6 విశ్వవిద్యాలయాలు టాప్ 1000లోపు స్థానాలను పొందాయి. వీటిలో రాష్ర్టానికి చెందిన రెండు విశ్వవిద్యాలయాలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్( ఐఐటీ హెచ్)లు వరసగా 508, 552 ర్యాంకులు పొందాయి. అదేవిధంగా 2011 నుంచి 2022 మధ్య కాలంలో 1,774 ప్రచురణలు ఏఐ సంబంధిత పరిశోధనలతోనూ ఉన్నాయి.
142 స్టార్టప్‌లకు ప్రోత్సాహాం…
టీ-ఎయిమ్ ద్వారా నిర్వహిస్తున్న రెవ్ అప్ కార్యక్రమం ద్వారా 142 ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సాహించారు. మార్కెటింగ్, ఆర్థిక సహకారం, నిపుణులతో మార్గ నిర్దేశనం చేసి విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దారు.