హైదరాబాద్, జనవరి 10: పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తమ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో సచిన్ టెండూల్కర్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నట్టు, ఈ నియామకం వచ్చే మూడేండ్లపాటు కొనసాగనున్నదన్నారు. వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి అవసరమయ్యే నిధుల్లో రూ.500 కోట్లను ఐపీవో ద్వారా సేకరించాలనుకుంటున్నట్టు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు యూనిట్లను నిర్వహిస్తున్న సంస్థ..మరో ఆధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మహేశ్వరంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబోతున్నట్టు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.210 కోట్లుగా నమోదైన టర్నోవర్, ఈసారి రూ.450 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వ్యాపార విస్తరణ పూర్తయితే 2029-30 నాటికి రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ర్టాల్లో రంగులను విక్రయిస్తుండగా, భవిష్యత్తులో తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ప్రవేశించనున్నట్టు ప్రకటించారు.