Tech Layoffs | ఇటీవల కాలంలో టెక్ రంగంలో లేఆఫ్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న లే ఆఫ్స్‌కు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. కొవిడ్ సమయంలో వేగంగా నియామకాలు జరగడమేనన్నారు. ‘ది వెర్జ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో చాలా కంపెనీలు సిబ్బందిని 30 నుంచి 100శాతం వరకు పెంచుకున్నాయని.. దాని ప్రభావం ఇప్పుడిప్పుడు కనిపిస్తుందన్నారు. ఒక పరిశ్రమ ఎక్కువగా పెరిగితే.. అది చివరికి సంతులనం పొందేందుకు తగ్గించుకోవాల్సి వస్తుందన్నారు.
ఇది సహజమైన దిద్దుబాటు ప్రక్రియ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 2025 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 2700 మంది ఉద్యోగులను తగ్గిస్తామని ఐబీఎం ప్రకటించింది. ఈ ప్రక్రియ సాధారణ వ్యాపార సర్దుబాట్లలో భాగమని కంపెనీ తెలిపింది. ఉపాధిపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావంపై సైతం అరవింద్ కృష్ణ స్పందించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పదిశాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోతారని.. కానీ, కొత్త అవకాశాలను సైతం సృష్టిస్తుందని చెప్పారు. ఉత్పాదకత పెరుగుతున్న సమయంలో కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటాయన్నారు.
ప్రాథమిక స్థాయి పనులన్నీ ఏఐ చేపడుతుందని.. కానీ వ్యూహాత్మక, సృజనాత్మక పనులు మానవులతో నిర్వహించబడుతాయన్నారు. ఏఐ కేవలం ఖర్చును తగ్గించే సాధనంగా పరిగణించి.. ఎంట్రీ లెవల్ నియామకాలను తగ్గిస్తున్న కంపెనీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏఐని కేవలం ఖర్చు తగ్గింపు సాధనంగా భావిస్తున్నారని.. ఏఐతో కొత్త యువ ఉద్యోగి పదేళ్ల సీనియర్ చేసే పనిని చేయగలడని.. ఎంట్రీ లెవల్ ఉద్యోగులు లేకపోతే రేపు కొత్త టెక్నాలజీని ఎవరు సృష్టిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఐబీఎం క్యాంపస్ నియామకాలను పెంచుతుందని.. గత నెలలో వచ్చే ఏడాది కాలేజీ విద్యార్థుల నియామకాలను మరింత పెంచుతుందని ఆయన ప్రకటించారు. ఇతర కంపెనీలు నియామకాలను వాయిదా వేస్తున్నప్పటికీ, తాము దానికి విరుద్ధంగా అడుగులు వేస్తామన్నారు. రాబోయే ఏడాదిలో గత సంవత్సరాల కంటే ఎక్కువ మంది కొత్త గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటామని చెప్పుకొచ్చారు.