న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్ మధ్యకాలం)లో రూ.9,624 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.8,433 కోట్లతో పోలిస్తే 14.1 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 16.7 శాతం ఎగబాకి రూ.46,867 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.40,135 కోట్లుగా ఉన్నది. మరోవైపు ప్రతిషేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
గత త్రైమాసికంలో 19,690 మంది సిబ్బంది చేరడంతో మొత్తం సంఖ్య 5,28,748కి చేరుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 78 వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు ప్రకటించింది.
గత త్రైమాసికంలో సంస్థ 7.6 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నది.
కంపెనీ సీఈవో రాజేశ్ గోపినాథన్ పదవీకాలాన్ని మరో ఐదేండ్లు పొడిగించింది. దీంతో ఆయన ఫిబ్రవరి 27, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.