NRI TDS | ప్రవాస భారతీయులు (ఎన్నారై) అయినా.. భారత్లో ఆస్తులపై ఆదాయం పొందుతుంటారు. ఆ ఆదాయం పన్ను శ్లాబ్ పరిధిలో ఉంటే తప్పనిసరిగా వారి ఖాతాల నుంచి ఆదాయం పన్నుశాఖ టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. కానీ తాజాగా ఎన్నారైల ఇండియన్ ఆస్తులపై ఆదాయం నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసే విషయంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలు సవరించింది. టాక్స్ డిడక్షన్ నుంచి మినహాయింపు పొందేందుకు సంబంధిత ఎన్నారై.. టీడీఎస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
టీడీఎస్ నుంచి తప్పించుకోవడానికి వారు ఆదాయం పన్ను చట్టంలోని ఫామ్-15జీ/హెచ్ సమర్పించనవసరం లేదు. కానీ పన్ను మదింపు అధికారి నుంచి తక్కువ లేదా నిల్ టీడీఎస్ సర్టిఫికెట్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇలా ఆదాయం మదింపు అధికారులు జారీ చేసే టీడీఎస్ సర్టిఫికెట్ ఆధారంగా పన్ను చెల్లింపు దారుడి నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేసుకోరు. సంబంధిత వ్యక్తి ఆదాయం నుంచి తక్కువ పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను డిడక్ట్ చేయరు. ఈ మేరకు ఎన్నారైల భారత్ ఆస్తుల నుంచి టీడీఎస్ డిడక్ట్ మినహాయింపుపై సీబీడీటీ విధానాలు, నిబంధనలు అప్ డేట్ చేస్తూ గత నెల 27న సర్క్యులర్ జారీ చేసింది. ఎన్నారైలు తమ ఆదాయంపై మదింపు అధికారులకు ఇచ్చే దరఖాస్తు ధ్రువీకరణకు గల వివిధ పద్దతులను ఈ సర్క్యులర్ తొలగించి వేసింది.
ఆదాయం పన్ను చట్టంలోని అప్లికేషన్ ఫామ్-13 సబ్మిట్ చేసిన తర్వాత టీడీఎస్ మదింపు అధికారి.. దానికి కారణాలు పరిశీలించిన తర్వాత ధ్రువీకరిస్తారు. ఆ అప్లికేషన్ను సాఫ్ట్ వేర్ సాయంతో చెక్ చేసి.. ఎంత టీడీఎస్ విధించాలో సూచిస్తారు. తక్కువ టీడీఎస్ విధించాలని గానీ, అసలు టీడీఎస్ అక్కర్లేదని సూచించవచ్చు. అలా కాకుండా ఎన్నారై దాఖలు చేసిన అప్లికేషన్ను పరిశీలించిన సాఫ్ట్ వేర్, ఆదాయం మదింపు అధికారి ఒకే టీడీఎస్ రేట్ ఖరారు చేస్తే మాత్రం సదరు ఫామ్-13 తిరస్కరణకు గురవుతుంది. ఒకవేళ టీడీఎస్ మదింపు అధికారి తక్కువ టీడీఎస్ సిఫారసు చేస్తే నిర్దిష్ట కాలం మాత్రమే ఆ సిఫారసు అమల్లో ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరానికి గానీ, ఒక ప్రత్యేకమైన లావాదేవీకి గానీ వర్తిస్తుంది.