తపాలా శాఖ నుంచి వచ్చే చిన్న మొత్తాల పొదుపు పథకాలను.. దేశంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. ఇందుకు కారణం భారత ప్రభుత్వం భరోసా ఉండటమే. పైగా ఆయా స్కీముల్లో పెట్టుబడులపై, వాటిద్వారా పొందే ఆదాయంపై ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద మదుపరులకు పన్ను మినహాయింపులూ వర్తిస్తాయి. ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలదాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐటీ ప్రయోజనాలున్న 5 పోస్టాఫీస్ స్కీములను ఒక్కసారి పరిశీలిస్తే..
అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. కనీస పెట్టుబడి రూ.500. గరిష్ఠం ఏటా రూ.1.5 లక్షలు. పీపీఎఫ్‌పై వడ్డీరేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 7.1 శాతం. పీపీఎఫ్‌లో డిపాజిట్లకు, దానిపై పొందే వడ్డీ ఆదాయానికి, మెచ్యూరిటీ మొత్తాలను తీసుకున్నా ఎలాంటి పన్నులూ ఉండవు.
ఎన్ఎస్సీ అనేది ఓ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం. దీనిద్వారా గ్యారంటీడ్ ఆదాయం, ట్యాక్స్ సేవింగ్స్ రెండూ ఉంటాయి. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను వడ్డీరేటు 7.7 శాతం. మెచ్యూరిటీపై పొందవచ్చు. ఇక ఈ స్కీంలో కనీసం రూ.1,000, గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ఎస్సీ కాలపరిమితి ఐదేండ్లు. అయితే పెట్టుబడిపై రూ.1.5 లక్షలదాకా పన్నుండకపోయినా.. వడ్డీ ఆదాయంపై పన్నులుంటాయి. అయితే పన్ను ప్రయోజనాల కోసం తొలి నాలుగేండ్లలో రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే ఈ ఎస్ఎస్వై. ఇందులో పన్ను ప్రయోజనాలతో కూడిన అధిక రాబడులుంటాయి. కనీసం రూ.250, గరిష్ఠంగా ఏటా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. పెట్టుబడికి, వడ్డీ ఆదాయానికి, మెచ్యూరిటీ మొత్తాలకు పన్నులుండవు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్కిగాను వడ్డీరేటు 8.2 శాతంగా ఉన్నది. వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఏటేటా చక్ర వృద్ధిని అనుసరించి లాభాల్ని అందిస్తారు.
వృద్ధులను ఉద్దేశించి తెచ్చిన పథకం ఇది. ఎస్సీఎస్ఎస్లోనూ పన్ను ప్రయోజనాలతో కూడిన లాభాలుంటాయి. ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠ పెట్టుబడికున్న పరిమితి రూ.30 లక్షలు. అయితే పెట్టుబడిపై రూ.1.5 లక్షలదాకా పన్నుండకపోయినా.. వడ్డీ ఆదాయానికి పన్నుంటుంది. ఈ ఏప్రిల్-జూన్కిగాను వడ్డీరేటు 8.2 శాతం.
ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుకోవచ్చు. వడ్డీ ఆదాయానికి పన్నులు వర్తిస్తాయి. రూ.1.5 లక్షలదాకా పెట్టుబడులకు పన్ను మినహాయింపులుంటాయి. అయితే ఐదేండ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే పన్ను ప్రయోజనాలు వర్తించవు. ఈ ఏప్రిల్-జూన్కిగాను వడ్డీరేటు 7.5 శాతం. మూడు నెలలకోసారి లెక్కించి ఏడాదికోసారి చెల్లిస్తారు.