Tata Motors | కమర్షియల్ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఒకవేళ మీరు టాటా కమర్షియల్ వెహికల్ కొనాలనుకుంటే ఈ నెలాఖరు వరకూ అంటే 11 రోజుల్లో మాత్రమే తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల కొనుగోలు ఖర్చుతో కూడుకున్నదవుతుంది. విభిన్న మోడల్స్, వేరియంట్ వెహికల్స్ మీద సగటున మూడు శాతం ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
కార్ల తయారీ ఖర్చు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో టాటా మోటార్స్ తన వాహనాల ధరలు పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూలై మూడో తేదీన కార్ల ధరలు సగటు 0.6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అప్పుడు కూడా కార్ల తయారీ ఖర్చు పెరగడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
అంతకుముందు కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం.. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాణిజ్య వాహనాల ధరలు.. ఐదు శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. అంతకుముందు ఫిబ్రవరిలో ఐసీఈ కార్ల ధరలు సగటున 1.2 శాతం పెంచివేసింది.
గత ఫిబ్రవరి 10న టాటా టియాగో.ఈవీ కారు ధర సుమారు రూ.20 వేలు పెంచేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రావడంతో కార్ల ధరలు పెరిగాయి. టాటా మోటార్స్.. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్తోపాటు ఎస్‌యూవీలు పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్ కార్లు విక్రయిస్తోంది. వీటి ధరలు నుంచి రూ.5.54 లక్షల నుంచి రూ.25 లక్షల పలుకుతున్నాయి.