న్యూఢిల్లీ, నవంబర్ 14: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీవో తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 22న మొదలై 24న ముగుస్తుంది. ఆఫర్ ధరను త్వరలో వెల్లడిస్తారు. కాగా, ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లలో పలు టాటా గ్రూప్ కంపెనీలుండగా, 19 ఏండ్ల తర్వాత మళ్లీ ఆ గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవో కావడంతో మదుపరులలో క్రేజ్ ఏర్పడింది.
టీసీఎస్ పబ్లిక్ ఆఫర్ 2004 ఆగస్టులో వచ్చింది. ఆ తర్వాతి పబ్లిక్ ఇష్యూ ఇదే. అయితే టాటా టెక్నాలజీస్.. టాటాల హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ది కాదు. టాటా మోటార్స్‌కు సబ్సిడరీ. తాజా ఐపీవోను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో టాటా మోటార్స్, ఇతర ఈక్విటీ ఫండ్స్ జారీ చేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్ ఈక్విటీ మూలధనంలో 15 శాతానికి సమానమైన 6,08,50,278 షేర్లను విక్రయిస్తున్నట్టు టాటా మోటార్స్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. టాటా మోటార్స్ 11.4 శాతం వాటాల్ని ఆఫ్‌లోడ్ చేస్తున్నది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున విక్రయిస్తున్నాయి.