బెంగళూరు, జూలై 22 : ఉద్యోగుల ఆకర్షణీయమైన బ్రాండ్‌లో తొలిస్థానంలో టాటా గ్రూపు నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది టాటా గ్రూపు సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని ర్యాండ్స్టడ్ ఎంప్లాయిర్ బ్రాండ్ రీసర్చ్ 2025లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ర్యాండ్స్టడ్ ఈ నివేదికను రూపొందించింది. దీంట్లో తొలిస్థానంలో టాటా గ్రూపు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్, సామ్సంగ్ ఇండియాలు ఉన్నాయి. ఈసారి గూగుల్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకోగా, ఇన్ఫోసిస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. తొలిసారిగా టాప్-10 జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చోటు దక్కడం విశేషం. ప్రభుత్వరంగ సంస్థల నుంచి చోటు దక్కించుకున్న తొలి సంస్థ ఎస్బీఐ కావడం విశేషం. దేశవ్యాప్తంగా 3,500 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. గడిచిన ఆరు నెలల్లో 38 శాతం మంది తమ పాత ఉద్యోగాలకు గుడ్‌బై పలికినట్టు వెల్లడించిన ర్యాండ్స్టడ్.. భారత్‌లో ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ సెక్టార్లో అత్యధిక మంది ఉద్యోగులను ఆకట్టుకుంటున్నది.
1. టాటాగ్రూపు, 2. గూగుల్, 3. ఇన్ఫోసిస్, 4. సామ్సంగ్ ఇండియా, 5. జేపీమోర్గాన్చేస్, 6. ఐబీఎం, 7. విప్రో, 8. రిలయన్స్ ఇండస్ట్రీస్, 9. డెల్ టెక్నాలజీస్, 10. ఎస్బీఐ