Tata Nexon | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన సబ్ కంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ (Tata Nexon Facelift) కారును త్వరలో ఆవిష్కరించనున్నది. తాజాగా వచ్చే నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంటుందని తెలుస్తున్నది. టాప్ ఎండ్ టాటా నెక్సాన్ కార్లలో మాత్రమే పనోరమిక్ సన్ రూఫ్.. మిగతా వేరియంట్లలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వాడతారని సమాచారం. కొత్త ఫీచర్లతో వచ్చే టాటా నెక్సాన్.. భారత్ మార్కెట్లో నిలబడేందుకు దోహద పడతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం కార్ల తయారీ సంస్థలన్నీ అత్యధికంగా సబ్ 4-మీటర్ కంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వాడుతున్నారు. తాజాగా మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మోడల్ కారులో తొలిసారి పనోరమిక్ సన్‌రూఫ్ అందిస్తోంది. దీంతో మహీంద్రా బాటలోనే టాటా మోటార్స్ తన సబ్ 4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్ కారులో పనోరమిక్ సన్ రూఫ్ జత చేయాలని సంకల్పించింది.
టాటా మోటార్స్ ఇటీవలే నెక్సాన్ మోడల్ కారులో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ రూ.8 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, డీజిల్ వేరియంట్ రూ.10 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నది. స్మార్ట్తోపాటు తాజాగా తీసుకొచ్చిన న్యూ ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ స్మార్ట్ (ఓ) రూ.15 వేలు ఎక్కువ. స్మార్ట్ + వేరియంట్ పై రూ.30 వేలు, స్మార్ట్ + ఎస్ వేరియంట్ మీద రూ.40 వేల ధర తగ్గించింది టాటా మోటార్స్. అంటే టాటా నెక్సాన్ స్మార్ట్ + కారు ధర రూ.8.90 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాటా నెక్సాన్ స్మార్ట్ + ఎస్ వేరియంట్ ధర రూ.9.40 లక్షలు పలుకుతుంది. టాటా నెక్సాన్ డీజిల్ ఇంజిన్ స్మార్ట్ + వేరియంట్ రూ.10 లక్షలు (ఎక్స్ షోరూమ్), స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.10.60 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి.