
Tata Motors on Ford | అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ చెన్నై మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను టాటా మోటార్స్ టేకోవర్ చేయనున్నదన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టాటా మోటార్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలో ఫోర్డ్ ఇండియా మాజీ ఎండీ అనురాగ్ మెహ్రోత్రా చేరిన సంగతి తెలిసిందే. భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించిన 15 రోజులకు అనురాగ్ మెహ్రోత్రా.. టాటా మోటార్స్‌లో చేరడం గమనార్హం.
ఇక టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా సంస్థలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర శివారుల్లోని సనంద్‌లో ఉత్పాదక యూనిట్లు కలిగి ఉన్నాయి. ఇవి రెండూ పక్కపక్కనే ఉండడం యాదృచ్ఛికం. టాటా మోటార్స్.. టియాగో, టైగోర్ ఉత్పత్తి చేస్తున్నది. ఫోర్డ్ ఇండియా.. ఫీగో, ఫ్రీ స్టైల్, అస్పైర్ మోడల్ కార్లను ఉత్పత్తి చేసింది. చెన్నలోని ఫోర్డ్ యూనిట్.. ఎకోస్పోర్ట్, ఎండీవర్ ఎస్యూవీ మోడల్స్‌ను ఉత్పత్తి చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రాతో ఫోర్డ్ ఇండియాకు ఈ ఏడాది ప్రారంభంలో జాయింట్ వెంచర్ ముగిసిపోయింది. గత పదేండ్లుగా 200 కోట్ల డాలర్లకు పైగా నష్టాలను చవి చూస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోర్డ్ చెన్నై యూనిట్‌ను టాటా మోటార్స్ టేకోవర్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ఫోర్డ్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడు ఫోర్డ్ కంపెనీ ఆధీనంలోనే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఉండేది. నష్టాలను తగ్గించుకునేందుకు జేఎల్ఆర్ను వదిలించుకోవాలని ఫోర్డ్ నిర్ణయం తీసుకున్నది. అప్పట్లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ను నాటి టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.