ముంబై, జూలై 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో మైలురాయిని సాధించింది. దేశీయ రోడ్లపై 20 లక్షల యూనిట్ల ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఈ సందర్భంగా కొత్తగా ఎస్‌యూవీలను కొనుగోలు చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
‘కింగ్స్ ఆఫ్ ఎస్యూవీ’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ వాహనాలపై రూ.1.40 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని కంపెనీ సూచించింది. దీంట్లోభాగంగా హారియర్ ప్రారంభ ధరను రూ.14.99 లక్షలకు దించిన సంస్థ..సఫారీ ధరను కూడా రూ.15.49 లక్షలకు తగ్గించింది. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనమైన నెక్సాన్‌పై రూ.1.3 లక్షల వరకు తగ్గించింది. ఈ ఆఫర్లు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
మారుతి వ్యారెంటీ పెంపు
మారుతి సుజుకీ కస్టమర్ల బాటపట్టింది. ఇప్పటికే కార్లను కొనుగోలు చేసిన వారికి రెండేండ్లు లేదా 40 వేల కిలోమీటర్ల వ్యారెంటీ గడువును మూడేండ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కొత్త కారును కొనుగోలు చేసిన వారు మూడేండ్ల వరకు ఎలాంటి భారం వేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యారెంటీ గడువును పెంచినట్లు, దీనిని కూడా ఆరేండ్ల వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని ఎంఎస్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. ఇందుకోసం పలు ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
వీటిలో ప్లాటినం ప్యాకేజీ కింద వ్యారెంటీని నాలుగేండ్లు లేదా 1.20 లక్షల కిలోమీటర్లు, రాయల్ ప్లాటినం ప్యాకేజీ కింద ఐదేండ్లు లేదా 1.40 లక్షల కిలోమీటర్లు, సాలిటైర్ ప్యాకేజీ కింద ఆరేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల ప్యాకేజీల్లో ఏదైనా ఎంచుకునే అవకాశం కస్టమర్‌కు ఉంటుందన్నారు.