Tata Motors | భారత్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. దాదాపు నెల రోజుల్లోనే లక్షకుపైగా కార్లను డెలివరీ చేసింది. నవరాత్రుల నుంచి దీపావళి మధ్యకాలంలో కంపెనీ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అమ్మకాలు 33శాతం వరకు పెరిగాయని టాటా మోటార్స్ చెప్పింది. జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ సమయంలో డిమాండ్ కారణంగా అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ యూఎస్వీ మోడల్స్‌కు ఫుల్ డిమాండ్ కనిపించింది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర మాట్లాడారు. నవరాత్రుల నుంచి దీపావళి మధ్య నెల రోజుల్లో లక్షకుపైగా వాహనాల డెలివరీలతో చారిత్రక మైల్స్టోన్ చేరామన్నారు.
ఎస్‌యూవీలు ఈ వృద్ధిని ముందుకు నడిపించాయన్నారు. కంపెనీ విక్రయించిన వాహనాల్లో అత్యధికంగా నెక్సాన్ మోడల్‌ను డిలివరీ చేసింది. 38వేల యూనిట్లతో 73శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, టాటా పంచ్ 32వేల యూనిట్లతో 29శాతం వృద్ధిని సాధించినట్లు చెప్పింది. ఎస్‌యూవీలతో పాటు ఈవీ విభాగంలోనూ భారీగానే డెలివరీలు చేసింది. నెల రోజుల పండుగ సీజన్ సమయంలో దాదాపు 10వేలకుపైగా ఈవీ కార్లను డెలివరీ చేసినట్లు చెప్పింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 37శాతం పెరిగాయని.. ఈ విజయంతో మిగతా కాలంలోనూ మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నామని.. రాబోయే రోజుల్లో కొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సీఈవో తెలిపారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంచనా ప్రకారం.. ఈ సీజన్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ధనత్రయోదశి రోజున అన్ని కంపెనీలు కలిసి ఒకేరోజు లక్షకుపైగా వాహనాలను డెలివరీ చేశాయి. మార్కెట్లో వీటి విలువ రూ.8500 కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.