Tata Motors | న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ లాభాలకు బ్రేక్‌పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,450 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.3,832 కోట్ల లాభంతో పోలిస్తే 9.9 శాతం పడిపోయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,04,444 కోట్ల నుంచి రూ.1,00,534 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది.
అమ్మకాలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో క్షీణత కనబరిచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. నిర్వహణ ఖర్చులు రూ.1,00,649 కోట్ల నుంచి రూ.97,330 కోట్లకు తగ్గాయి. జేఎల్ఆర్ ఆదాయం 5.6 శాతం తగ్గి 6.5 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. గత త్రైమాసికంలో సంస్థ ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.1 శాతం తగ్గి 1,30,500కు పడిపోయాయి. కమర్షియల్ వాహన అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 19.6 శాతం తగ్గి 79,800కి తగ్గాయి.
విప్రోలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వాటా
న్యూఢిల్లీ, నవంబర్ 8: ఐటీ సేవల సంస్థ విప్రోలో 1.6 శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రేమ్‌జీ. పూర్తిగా బ్లాక్‌డీల్‌లో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.4,757 కోట్లు. షేరుకు రూ.560 చొప్పున 8,49,54,128 షేర్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. దీంతో విప్రోలో అజీం ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ట్రేడర్ 4.49 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు అయింది.