Tata Motors | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్ ) కార్లపై భారీగా ధరలు తగ్గించింది. ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ క్యాంపెయిన్లో భాగంగా అక్టోబర్ 31 వరకూ ధరలు తగ్గించినట్లు మంగళవారం ప్రకటించింది. టాటా.ఈవీ కార్లపై గరిష్టంగా రూ.3 లక్షల వరకూ ధర తగ్గించినట్లు తెలిపింది.
టాటా నెక్సాన్.ఈవీ కారు ధర గరిష్టంగా రూ.3 లక్షలు తగ్గించింది. టాటా పంచ్.ఈవీ కారుపై రూ.1.20 లక్షలు, టాటా టియాగో.ఈవీ కారుపై రూ.40 వేలు తగ్గించింది. ఈ ధర తగ్గింపుతోపాటు ఆరు నెలల పాటు దేశంలోని 5500 టాటా పవర్ చార్జింగ్ స్టేషన్ల వద్ద ఫ్రీ చార్జింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు తెలిపింది. తాజా తగ్గింపుతో టాటా టియాగో.ఈవీ కారు ధర రూ.7.99 లక్షలు, టాటా పంచ్.ఈవీ ధర రూ.9.99 లక్షలు, టాటా నెక్సాన్.ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ వరుసగా మూడు నెలల పాటు కార్ల విక్రయాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో కార్ల నిల్వలు క్లియర్ చేసుకోవడానికి టాటా మోటార్స్ ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. గత నెలలో కార్ల విక్రయాలు 4.5 శాతం తగ్గాయి. మారుతి సుజుకి కార్ల విక్రయాలు 8.5 శాతం, హ్యుండాయ్ 12.9 శాతం, టాటా మోటార్స్ 2.7 శాతం తగ్గాయి.