Tata Electronics- iPhones | తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తి నిరవధికంగా నిలిపేశారు. గత వారం టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఐ-ఫోన్ల విడి భాగాల తయారీ నిలిపేయాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. అగ్ని ప్రమాదం వల్ల మరింత నష్టం జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా ఎలక్ట్రానిక్స్ అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఉత్పత్తి నిలిపేశామని టాటా ఎలక్ట్రానిక్స్ పేర్కొంది.
’మళ్లీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘటనా స్థలం వద్ద ఫైరింజన్లను అందుబాటులో ఉంచాం’ అని స్థానిక జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం వేలు చెప్పారు. ఈ ఘటనపై ఆపిల్ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. సోమవారం కూడా సహాయ సిబ్బంది శిధిలాలను తొలగిస్తూ కనిపించారు. అధిక నష్టం జరక్కుండా అధికారులు తనిఖీలు చేపట్టారు.