Tata on Bislery | ప్యాకేజీ వాటర్ బ్రాండ్ బిస్లరీ ఇంటర్నేషనల్ టేకోవర్‌పై జరుగుతున్న చర్చలు నిలిపేస్తున్నట్లు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు చర్చలు నిలిపేశామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బిస్లరీ ఇంటర్నేషనల్‌తో ఎటువంటి ఖచ్చితమైన ఒప్పందం జరుగులేదని స్పష్టం చేసింది.
గత నవంబర్‌లో బిస్లరీ బ్రాండ్ ఓనర్ రమేశ్ చౌహాన్ స్వయంగా తమ సంస్థలో మెజారిటీ వాటాను టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయనున్నదని ప్రకటించారు. దాని విలువ రూ.6000-7000 కోట్లు ఉంటుందని తెలిపారు. ఏడెనిమిది నెలల్లో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు.
బిస్లరీ అనే పదం వాస్తవంగా ఇటాలియన్ సంస్థ ‘ఫెలిస్ బిస్లరీ’ది. 1965లో ప్యాకేజ్డ్ డ్రింక్డ్ వాటర్ బ్రాండ్‌తో ముంబైలోకి ఎంటరైంది. తర్వాత నాలుగేండ్లకు రమేశ్ చౌహాన్, ఆయన సోదరులు కలిసి నాటి మార్కెట్ ధరను బట్టి రూ.4 లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిస్లరీ ఇంటర్నేషనల్‌కు దేశవ్యాప్తంగానూ, ఇరుగు పొరుగు దేశాల్లోనూ 122 ఆపరేషనల్ ప్లాంట్లు, 4500 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.
ఇదిలా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆదాయం రూ.12,425 కోట్లు. 2023 ఆర్థిక సంవత్సరంలో బిస్లరీ సేల్స్ రూ.2500 కోట్లు కాగా, రూ.200 కోట్ల పై చిలుకు ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Tata on Bislery | బిస్లరీ వాటర్‌పై టాటా కన్ను.. టేకోవర్ కోసం చర్చలు?!