హైదరాబాద్, నవంబర్ 12 : ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలపై పెరుగుతున్న సైబర్‌దాడులు, డాటా ఉల్లంఘనల ముప్పు నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా ‘సైబర్ఎడ్జ్’ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ నేషనల్ హెడ్ నజ్మ్ బిల్గ్రామి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సైబర్ దాడులు అధికమవుతున్నాయని, అత్యధికంగా జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఒకటని ప్రతియేటా ఇక్కడ 20 వేలకు పైగా దాడులు జరిగి కోట్లాది రూపాయలు నష్టపోతున్నట్టు తెలిపారు.
రాబోయే మూడేండ్లలో సైబర్ బీమా పోర్ట్‌ఫోలియో తమ మొత్తం ఫైనాన్షియల్ ప్రీమియంలో దాదాపు 25 శాతం వాటా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ బీమా రూ.900 కోట్ల స్థాయిలో ఉండగా, ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. ప్రధానంగా ఆర్థిక సేవలు, ఐటీ, ఎంఎస్ఎంఈ రంగాలకు చెందిన సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని, 2024లో ఈ రెండు రాష్ర్టాల్లో 62 లక్షల మాల్వేర్లను గుర్తించినట్టు, వీటిద్వారా రూ.19.5 కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపారు.