హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సహకారంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ఆదిబట్లలో ఓ నూతన ఏరో ఇంజిన్ రొటేటివ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం దీన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ఐటీసీ కోహినూర్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ కేంద్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. సుమారు రూ.425 కోట్ల పెట్టుబడితో తెచ్చిన ఈ కేంద్రం ద్వారా దాదాపు 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. కాగా, లీప్ (లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్) ఇంజిన్‌కి సంబంధించిన అధునాతన మెషినింగ్, స్పెషల్ ప్రాసెస్లు సహా సంక్లిష్టమైన రొటేటింగ్ భాగాలన్నింటినీ ఒకేచోట ఉత్పత్తి చేసేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, జీఈ ఏరోస్పేస్ జాయింట్ వెంచరైన సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌కు లీప్ ఇంజిన్‌కి కావాల్సిన రొటేటింగ్ భాగాల సరఫరా కోసం 2024 జనవరిలోనే ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే టీఏఎస్ఎల్ ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొత్త తరం నారోబాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో గణనీయంగా ఉపయోగించబడుతున్న లీప్ ఇంజిన్లు.. అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ఇంధనాన్ని 15 శాతం వరకు ఆదా చేయడమేగాక, శబ్దం కూడా బాగా తగ్గి, వినియోగ సామర్థ్యం పెరుగుతున్నది.
లీప్ ఇంజిన్లకు అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద ఆపరేటర్‌గా భారత మారెట్ నిలుస్తున్నది. 75 శాతం భారతీయ కమర్షియల్ విమానాల్లో సీఎఫ్ఎం రూపొందించిన అధునాతన టర్బోఫ్యాన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలు 2 వేలకుపైగా లీప్ ఇంజిన్లను ఆర్డర్ చేయడమనేది దేశీయంగా పటిష్టమైన తయారీ, సపోర్టివ్ మౌలిక సదుపాయాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నది. భారత్, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల కోసం సంక్లిష్టమైన ఏరో ఇంజిన్ విడిభాగాలను తయారు చేసేందుకు టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్ 2018లో ఏర్పాటైంది. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏవియేషన్ పరిశ్రమ, ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లు విశేషంగా కృషి చేసిన విషయం తెలిసిందే. వేగంగా అనుమతుల మంజూరు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నైపుణ్యం కలిగిన యువతను అందించడంలో ప్రభుత్వం తరఫున ఎంతగానో సహకరించారు.
ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఏరో ఇంజిన్ రొటేటివ్ విడిభాగాలు చాలా కీలకమైనవి. భారత్‌లో అధునాతన తయారీ కేంద్రాలను నిర్మించడంపై మా నిబద్ధతకు, సంక్లిష్టమైన గ్లోబల్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్‌ల పారిశ్రామికీకరణలో మా సామర్థ్యాలకు ఈ అంతర్జాతీయ స్థాయి కేంద్రం నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ఇంజిన్ ప్లాట్‌ఫాంలలో ఒకటైన లీప్ ప్రోగ్రామ్‌లో భాగం కావడం, అంతర్జాతీయ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థలో కచ్చితత్వం, నాణ్యత, శ్రేష్ఠతను పాటించడంపై మేము ప్రధానంగా దృష్టి పెట్టాం.
అధునాతన మౌలిక సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల సరఫరా వ్యూహంలో ఈ ప్లాంట్ కీలకంగా ఉంటుంది. మా మారెట్లకు సమీపంలో తయారు చేసేందుకు, సరఫరా వ్యవస్థను పటిష్టపర్చుకునేందుకూ కలిసొస్తుంది. మా కస్టమర్లకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన, పనితీరు, సుస్థిరత విషయాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తులను అందించేందుకు కట్టుబడి ఉన్నాం. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంలో ఇదొక నూతన అధ్యాయం.