Tata Ace EV 1000 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. భారత్ మార్కెట్లోని ఈ-కార్గో మొబిలిటీ సెగ్మెంట్ లోకి టాటా ఏస్ ఈవీ1000 మినీ ట్రక్కు ఆవిష్కరించింది. జీరో ఎమిషన్ మినీ ట్రక్కులో గరిష్టంగా ఒక టన్ను వరకూ లోడ్ చేయవచ్చు. టాటా పంచ్ ఎస్యూవీ కారు బరువు ఉన్న టాటా ఏస్ ఈవీ1000 సింగిల్ చార్జింగ్ తో 161 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, వారి అవసరాలకు అనుగుణంగా టాటా ఏస్ ఈవీని డెవలప్ చేసినట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఎఫ్ఎంసీజీ, బేవరేజస్, పెయింట్ అండ్ లుబ్రికెంట్స్, ఎల్పీజీ అండ్ డెయిరీ ఉత్పత్తుల రవాణా అవసరాలను తీరుస్తుందీ మినీ ట్రక్కు. ఈ మినీ ట్రక్ ధర రూ.11.27 లక్షలు పలుకుతుంది.
అడ్వాన్స్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫ్లీట్ ఎడ్జ్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్తో వస్తున్న టాటా ఏస్ ఈవీ బెస్ట్ ఇన్ క్లాస్ గా నిలుస్తుంది. టాటా ఏస్ ఈవీ ట్రక్కు ఎవోజెన్ పవర్ ట్రైన్తో వస్తోంది. ఏడేండ్ల బ్యాటరీ వారంటీ, ఐదేండ్ల సమగ్ర నిర్వహణ ప్యాకేజీ అందిస్తుంది. డ్రైవింగ్ శ్రేణిని బలోపేతం చేసేందుకు అడ్వాన్స్డ్ బ్యాటరీ కూలింగ్ సిస్టమ్, రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రెగ్యులర్, ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటది. గరిష్టంగా 130 ఎన్ఎం టార్క్ వెలువరించే సామర్థ్యం గల 27 కిలోవాట్ల (36 హెచ్పీ) మోటార్ కలిగి ఉంటుంది.