Stock Market | ముంబై, సెప్టెంబర్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డులతో హోరెత్తించాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ.. రెండూ సరికొత్త ఇంట్రా-డే, క్లోజింగ్ హైలను నమోదు చేశాయి. ఉదయం ఆరంభం నుంచే దూకుడు మీదున్న మదుపరులు.. పెట్టుబడులకు పెద్దపీట వేస్తూపోయారు.
ఈ క్రమంలోనే మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ తొలిసారి 83,000 స్థాయిని అధిగమించింది. ఆఖరి గంటలో జరిగిన ట్రేడింగ్లోనైతే 1,593.03 పాయింట్లు లేదా 1.95 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 83,116.19 వద్దకు వెళ్లింది.
అయితే ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో చివరకు 1,439.55 పాయింట్లు లేదా 1.77 శాతం పెరుగుదలతో ఆల్‌టైమ్ హై 82,962.71 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 470.45 పాయింట్లు లేదా 1.89 శాతం ఎగబాకి లైఫ్‌టైమ్ హై 25,388.90 వద్ద నిలిచింది. అయినప్పటికీ ఇంట్రా-డేలో 514.9 పాయింట్లు లేదా 2 శాతం పుంజుకొని మొదటిసారి 25,433.35 స్థాయిని తాకింది.
రంగాలవారీగా..
బుల్ రన్‌తో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే స్థిరపడ్డాయి. రంగాలవారీగా చూస్తే.. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 3.05 శాతం పెరిగింది. టెలికం (2.61 శాతం), విద్యుత్తు (2.02 శాతం), ఆటో (1.99 శాతం), యుటిలిటీస్ (1.93 శాతం), కమోడిటీస్ (1.85 శాతం) షేర్లూ రాణించాయి. షేర్లలో భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆకట్టుకున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.32 శాతం, స్మాల్‌క్యాప్ 0.79 శాతం చొప్పున పెరిగాయి.
కలిసొచ్చిన గ్లోబల్ ట్రెండ్
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించబోతున్నాయన్న సంకేతాలు.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. ఈ జోష్ దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషించారు. ఇక విదేశీ మదుపరుల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పెట్టుబడులు కూడా ఈక్విటీ మార్కెట్లను పరిగెత్తించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు భారీగా పెరిగాయి. చైనా సూచీ మాత్రం స్వల్పంగా నష్టపోయింది. ఐరోపా మార్కెట్లూ ఆకర్షణీయ లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
తిరుపతి బాలాజీ భళా
మార్కెట్లోకి ప్రవేశించిన తొలిరోజే శ్రీ తిరుపతి బాలాజీ అగ్రో ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ షేర్లు అదిరిపోయే లాభాలను సొంతం చేసుకున్నాయి. ఏకంగా 17.51 శాతం చొప్పున విలువను పెంచుకున్నాయి. ఇష్యూ ధర రూ.83గా ఉంటే బీఎస్ఈ లిస్టింగ్ రూ.92.90 వద్ద జరుగడం గమనార్హం. దీంతో ట్రేడింగ్ మొదట్లోనే 11.92 శాతం వృద్ధి దక్కింది.
మదుపరులు ఈ షేర్లను కొనేందుకు విపరీతమైన ఆసక్తి చూపడంతో చివరకు రూ.97.54 వద్ద ముగిసింది. దీంతో 17.51 శాతం పెరిగినైట్టెంది. గురువారం ట్రేడింగ్ సమయం ముగిసే నాటికి సంస్థ మార్కెట్ విలువ రూ.795.64 కోట్లుగా ఉన్నది. కెమికల్స్, అగ్రోకెమికల్స్, ఫుడ్ మైనింగ్, వేస్ట్ డిస్పోజల్ ఇండస్ట్రీ, వ్యవసాయ పరిశ్రమలు, లూబ్రికెంట్స్, వంటనూనెలు తదితర రంగాల్లో ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి.
467 లక్షల కోట్లకు..
స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో ఎగిసింది. గురువారం ఒక్కరోజే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.6,59,895.19 కోట్లు పెరిగి రూ.4,67,36,045.21 కోట్ల (5.57 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. వచ్చే వారం జరిగే పాలసీ సమీక్షలో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లకు కోత పెడుతుందన్న అంచనాలు.. దాదాపు అన్ని షేర్లకు కొనుగోళ్ల మద్దతునిచ్చాయని మెహెతా ఈక్విటీస్ లిమిటెడ్ రిసెర్చ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ తాప్సీ అన్నారు.