Adani on NDTV | ప్రణయ్‌రాయ్ సారధ్యంలోని టీవీ చానెల్ గ్రూప్ `న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ – NDTV) ను టేకోవర్ చేయడం ఒక బాధ్యత అని ఇండియన్ బిలియనీర్ గౌతం అదానీ చెప్పుకొచ్చారు. ఎన్డీటీవీ టేకోవర్‌ను బిజినెస్ అవకాశం కంటే ఒక బాధ్యతగానే చూస్తున్నట్లు ఆంగ్ల దినపత్రికకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండిపెండెంట్ మీడియా సంస్థగా ఉన్న ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఆగస్టు నెలాఖరులో తన ప్రణాళికలను గౌతం అదానీ బయట పెట్టారు. ఎన్టీటీవీ టేకోవర్ ప్రక్రియపై జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం మార్పుతో ఎన్డీటీవీ సంపాదకీయ సమగ్రత దెబ్బ తింటుందని భావిస్తున్నారు.
1988లో భార్యాభర్తలు ప్రణయ్ రాయ్, రాధికారాయ్లతో కూడిన టీం ఎన్డీటీవీ ఏర్పాటైంది. అదానీ గ్రూప్ తీరుపై ఇంతకుముందు ఎన్డీటీవీ స్పందించింది. ఎన్డీటీవీ ప్రమోటర్ల సమ్మతి లేకుండా, సంప్రదింపులు లేకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ గ్రూప్ సంస్థను టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త గౌతం అదానీ. మోదీ ప్రభుత్వ హయాంలో గౌతం అదానీ, ఇతర బిలియనీర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తరుచుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.
`ఇండిపెండెన్స్ అంటే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే.. మీరు అది తప్పు అని చెప్పొచ్చు. కానీ, ప్రభుత్వం ప్రతి రోజూ చేసే మంచి పని గురించి చెప్పడానికి కూడా మీకు ధైర్యం ఉండాలి` అని గౌతం అదానీ అన్నారు.
తమ సంస్థ టేకోవర్ చేసిన తర్వాత కూడా ఎన్డీటీవీ చైర్మన్‌గా కొనసాగొచ్చునని ప్రణయ్‌రాయ్‌ను ఆహ్వానిస్తున్నానని గౌతం అదానీ తెలిపారు. టైమ్స్ గ్రూప్‌లోని టైమ్స్ నౌ, నెట్వర్క్ 18, సీఎన్ఎన్ 18 సహా పలు మీడియా సంస్థలను ముకేశ్ అంబానీ నియంత్రిస్తున్నారు.