SVB Bankruptcy | సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) (Silicon Valley Bank -SVB) దివాళా తీయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్వీబీ దివాళా తీయడంతో టెక్నాలజీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఎస్వీబీ దివాళా తీయడం అమెరికా బ్యాంకింగ్ చరిత్రలోనే రెండో అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్వీబీ పతనంపై నెతన్యాహూ ట్వీట్ల వర్షం కురిపించారు.
‘అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్.. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) పతనాన్ని చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. ఇది హై-టెక్ వరల్డ్‌లోనే అతిపెద్ద సంక్షోభానికి దారి తీసింది’ అని ట్వీట్ చేశారు. ఎస్వీబీ దివాళా వల్ల ఇజ్రాయెల్ టెక్ పరిశ్రమపై ప్రభావం పడుతుందా? అన్న కోణంలో తమ దేశంలోని సీనియర్ టెక్నాలజీ నిపుణులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘అవసరమైతే ఇజ్రాయెల్ హై-టెక్ కంపెనీలు, వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగుల రక్షణకు బాధ్యతలు తీసుకుంటాం. ఈ సంక్షోభం వల్ల నిధుల కొరత సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు.
ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైందని, శక్తిమంతమైందని, ఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొంటుందని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. నెతన్యాహు ప్రస్తుతం రోమ్ అధికారిక పర్యటనలో ఉన్నారు. స్వదేశానికి తిరిగి రాగానే ఫైనాన్స్, ఆర్థిక మంత్రులు, ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో ఈ సంక్షోభంపై చర్చిస్తానని వెల్లడించారు. ఎస్వీబీతో బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్న ఇజ్రాయెలీ టెక్ సంస్థలకు ద్రవ్య లభ్యత అంటే నగదు లభ్యత సమస్య తలెత్తకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎస్వీబీ పతనం ప్రభావం ఆ సంస్థ శాఖలు గల అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని టెక్ పరిశ్రమపై పడింది.