హైదరాబాద్, సెప్టెంబర్ 23: సుందరం ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన సుందరం హోమ్ ఫైనాన్స్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్టు సుందరం హోమ్ ఫైనాన్స్ ఎండీ లక్ష్మీనారాయణన్ దొరస్వామి తెలిపారు. చెన్నై కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న సంస్థ..తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట్ వద్ద నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై మరింత దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. తెలంగాణతోపాటు ఏపీల్లో గృహ రుణాల వ్యాపారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక రంగానికి పెద్దపీట వేస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్నిచ్చినట్టు అవుతున్నదన్నారు. దీంతో రాష్ట్రంలో శాఖల సంఖ్య ఆరుకి చేరుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.400 కోట్ల మేర గృహ రుణాలు మంజూరు చేసినట్టు, ఈ ఏడాది 20 శాతం వృద్ధితో రూ.500 కోట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు.