Credit Cards | దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు 15శాతం పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెప్పాయి. ఇ-కామర్స్, ఫుడ్ డెలివరీతో పాటు ఇతర అవసరాల కోసం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగినట్లు భావిస్తున్నారు. బ్యాంకులు సైతం ఈఎంఐ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్ల పేరుతో ఆఫర్లు సైతం ఇస్తున్నాయి. తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు క్రెడిట్కార్డులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొంది. థింక్ 360 ఏఐ అధ్యయనం ప్రకారం.. నెలకు రూ.50వేల కంటే తక్కువ జీతం ఉన్న వారిలో 93శాతం మంది క్రెడిట్కార్డులపై ఆధారపడుతున్నట్లు చెప్పింది. అదే సమయంలో స్వయం ఉపాధి పొందుతున్న 85శాతం మంది సైతం క్రెడిట్కార్డులపై ఆధారపడుతున్నట్లుగా అధ్యయనం వెల్లడించింది. ఇప్పుడు పే తర్వాత (బీఎన్‌పీఎల్) సేవలను 18శాతం స్వయం ఉపాధి, వేతన జీవులు 15శాతం మంది ఉపయోగిస్తున్నట్లు డేటా పేర్కొంది.
ఈ అధ్యయనం రూ.20వేల మంది ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులపై నిర్వహించింది. ఈ సందర్భంగా థింక్ 360 ఏఐ ఫౌండర్, సీఈవో అమిత్ దాస్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశ క్రిడెట్ ల్యాండ్ స్కేప్‌లో క్రెడిట్‌కార్డులు, బీఎన్‌పీఎల్ ఇప్పుడు వేతన జీవులతో పాటు ఉపాధి పొందుతున్న వారికి ప్రతీ ఒక్కరికీ అవసరంగా మారాయన్నారు. పెరుగుతున్న ఫిన్ టెక్ కంపెనీలు డిజిటల్ లోన్ రెవల్యూషన్‌ను తీసుకువచ్చాయన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు రూ.92వేల కోట్లకుపైగా వ్యక్తిగత రుణాలు ఇచ్చాయి. ఇది మొత్తం రుణాల సంఖ్యలో 76శాతం ఉన్నట్లుగా సూచిస్తుందని పేర్కొన్నారు.