ముంబై, జనవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత రెండు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు రియల్టీ, విద్యుత్, ఆర్థిక షేర్ల నుంచి లభించిన మద్దతుతో భారీగా లాభపడ్డాయి. బ్యాంకుల పనితీరు మెరుగుపడిందని గణాంకాలు వెల్లడికావడం, దేశవ్యాప్తంగా ఇండ్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో ఈ రంగ షేర్లు కదంతొక్కాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఒక దశలో 600 పాయింట్ల వరకు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 490.97 పాయింట్లు అందుకొని 71,847.57 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 141.25 పాయింట్లు ఎగబాకి 21,658.60 స్థిరపడింది.
రూ.3 లక్షల కోట్లు పెరిగిన సంపద
నూతన సంవత్సరంలో మదుపరుల పంటపండింది. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరులు రూ.3 లక్షల కోట్ల సంపదను పోగేసుకున్నారు. సూచీలు ఒక్క శాతం లాభపడటంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీలు రూ.3,24,010.1 కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రికార్డు స్థాయి రూ.3,68,32,843.41 కోట్లకు చేరుకున్నది.