ముంబై, నవంబర్ 21 : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులు లాభపడిన సూచీలు.. శుక్రవారం కూడా అదే ఊపులో ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయిల్లోకి వెళ్తాయనుకున్నారంతా. అయితే మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లడంతో అంతా తారుమారైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు కొద్ది అవకాశాలే ఉన్నాయన్న అంచనాలు.. భారతీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు.
దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 400.76 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 85,231.92 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 444.84 పాయింట్లు పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 124 పాయింట్లు లేదా 0.47 శాతం దిగజారి 26,068.15 వద్ద నిలిచింది. నిజానికి గురువారం భారీ లాభాల నేపథ్యంలో సెన్సెక్స్ మరో 203.44 పాయింట్లు, నిఫ్టీ 23.90 పాయింట్లు దాటితే ఆల్‌టైమ్ హై రికార్డులు నమోదయ్యేవి. గత ఏడాది సెప్టెంబర్ 26న సెన్సెక్స్ 85,836.12 వద్ద, నిఫ్టీ 26,216.05 దగ్గర ముగిశాయి. ఇప్పటిదాకా ఇవే సూచీలకు గరిష్ఠ స్థాయిలు. ఏడాది గడిచిపోయినా మళ్లీ ఆ స్థాయిల్లోకి అటు సెన్సెక్స్గానీ, ఇటు నిఫ్టీగానీ వెళ్లలేదు.
టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా.. మెటల్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్, ఇండస్ట్రియల్స్ 2.35 శాతం నుంచి 1.43 శాతం మేర క్షీణించాయి. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు 1.30 శాతం చొప్పున పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో దక్షిణ కొరియా (3.79 శాతం), చైనా (2.45 శాతం), జపాన్ (2.40 శాతం), హాంకాంగ్ (2.38 శాతం) సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపించింది.