ముంబై, నవంబర్ 30: తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ లాభాలను నిలుపుకోలేకపోయాయి. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడం, అమెరికా మార్కెట్లు యథాతథంగా ట్రేడవడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 67 వేల పైకి చేరుకున్నది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 86.53 పాయింట్లు అందుకొని 66,988. 44కి చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 36.55 పాయింట్లు అందుకొని 20,133.15కి చేరుకున్నది. సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైప్పటికీ బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ వరుసగా రెండో రోజు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్నది. రంగాలవారీగా చూస్తే హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, రియల్టీ, ఇండస్ట్రీయల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి. కానీ, యుటిలిటీ, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టపోయాయి.
గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల సంపద కూడా అంతకంతకు పెరుగుతున్నది. గత మూడు సెషన్లలో మదుపరులు రూ.6.88 లక్షల కోట్ల సంపద పెరిగింది దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.3,35,60,155.58 కోట్లు లేదా 4 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. వరుసగా రెండోరోజు బుధవారం కూడా బీఎస్ఈ లిైస్టెన సంస్థల విలువ 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనే ఉన్నది. మే 24, 2021లో 3 లక్షల కోట్ల డాలర్లు అధిగమించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గత రెండున్నరేండ్లలోనే మరో లక్ష కోట్ల డాలర్లు పెరిగి 4 లక్షల కోట్ల డాలర్లు అధిగమించింది. మే 28, 2007న ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌నకు చేరుకున్న విషయం తెలిసిందే.