ముంబై, జూన్ 23 : దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం కనిపించింది. సోమవారం మదుపరులు అమ్మకాలకు పెద్దపీట వేశారు. దీంతో ఉదయం ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 511.38 పాయింట్లు లేదా 0.62 శాతం కోల్పోయి 82వేల స్థాయి దిగువకు చేరి 81,896.79 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 931.41 పాయింట్లు పడిపోవడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 140.50 పాయింట్లు లేదా 0.56 శాతం దిగజారి 24,971.90 వద్ద నిలిచింది.
ఐటీ, ఐటీ అనుబంధ, టెక్నాలజీ రంగాల షేర్లకు ఇన్వెస్టర్లు దూరంగా జరిగారు. ఐటీ సూచీ 1.48 శాతం, ఐటీ అనుబంధ రంగాల సూచీ 1.46 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.10 శాతం, ఆటో 0.88 శాతం, ఎఫ్ఎంసీజీ 0.62 శాతం, టెలికమ్యూనికేషన్ 0.50 శాతం, బ్యాంకింగ్ 0.38 శాతం చొప్పున పడిపోయాయి. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, ఐటీసీ, టీసీఎస్, మారుతీ షేర్లు బాగా నిరాశపర్చాయి. అయితే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 0.57 శాతం, మిడ్‌క్యాప్ 0.20 శాతం మేర పెరిగాయి. ఇరాన్‌లోని ప్రధాన అణు స్థావరాలపై అమెరికా బాంబులు వేయడం ఒక్కసారిగా ఉద్రిక్తతల్ని పెంచేసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు నష్టపోయాయి. చైనా, హాంకాంగ్ సూచీలు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 0.49 శాతం పెరిగి 77.39 డాలర్లు పలికింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం భారీగా క్షీణించింది. ఈ ఒక్కరోజే 23 పైసలు పడిపోయి 5 నెలలకుపైగా కనిష్ఠాన్ని తాకుతూ 86.78 వద్ద నిలిచింది. ఈ ఏడాది జనవరి 13న 86.70 వద్ద ముగిసింది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి వెళ్లింది. కాగా, ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు.. ఫారెక్స్ మార్కెట్లో ఒక్కసారిగా దేశీయ దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో రూపాయి బలహీనపడిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకానొక దశలో అధిక చమురు ధరలతో 86.85 స్థాయికి దిగజారింది. ఇదిలావుంటే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే రూపీ వాల్యూ కూడా మరింతగా క్షీణించవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 87 మార్కు దిగువకు పడిపోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేస్తూ 87.59కు పతనమైన విషయం తెలిసిందే.