Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల బుల్ జోరు కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సూచీలు.. మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఉదయం నష్టాలతో మొదలైనా.. కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. నిఫ్టీ 20వేల మార్క్‌కు చేరువ కాగా.. సెన్సెక్స్ మరోసారి గరిష్ఠానికి చేరింది. బుధవారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉదయం సెన్సెక్స్ 67,074 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైంది. మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గా కొనసాగింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో పయనించింది.
ఈ క్రమంలోనే సెన్సెక్స్ 67,619.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 474.46 పాయింట్ల లాభంతో 67,571.90 వద్ద వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 19,991.85 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 146 పాయింట్ల లాభంతో 19,979.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు రెండు శాతానికి పెరిగాయి. మారుతీ, ఎయిర్టెల్, ఎస్బీఐ, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు సైతం లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాలతో ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో విడిపోయిన తర్వాత 1.2శాతం లాభపడింది. రిలయన్స్ షేర్లు గురువారం 1.19 శాతం పెరిగి రూ.2619.80 వద్ద ముగిసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మార్కెట్ అంచనాల ప్రకారం రూ.160-190 కంటే ఎక్కువగా రూ. 261.85 వద్ద ట్రేడయ్యింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.35శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.13శాతం లాభపడ్డాయి. కాగా, నిఫ్టీ ఐటీ 0.66 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక ఫలితాలకు ముందు ఐటీ షేర్లు 2.2 శాతం క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన సానుకూల సాంకేతాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సడలించడం, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి బలమైన విశ్వాసంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ కేవలం 15 ట్రేడింగ్ సెషన్లలో 900 పాయింట్లకుపైగా లాభపడింది. జూన్ 28 నుంచి నిఫ్టీ 19వేల మార్క్‌పైన ట్రేడవుతున్నది.