Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైనా.. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, మదుపరులు అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్ట్రా డేలో ఏ దశలోనూ కోలుకోలేదు. డెరైవేటివ్ల కాంట్రాక్టుల గడువు ముగింపు, క్రూడాయిల్ ధరల ప్రభావం మార్కెట్లపై పడింది. ఉదయం సెన్సెక్స్ 66,406.01 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 66,406.01 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్ ఆ తర్వాత 65,423.39 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
చివరకు 610.37 పాయింట్ల నష్టంతో 65,508.69 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ సైతం 192.90 పాయింట్ల నష్టంతో 19,523.55 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,524 షేర్లు పురోగమించగా.. 2,007 షేర్లు క్షీణించాయి. 136 మాత్రం మారలేదు. మార్కెట్లో లార్సెన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఓఎన్జీసీ లాభపడగా.. టెక్ మహీంద్రా, ఎషియన్ పేయింట్స్, విప్రో, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ నష్టపోయాయి.