భారీ నష్టాలతో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 2,032.65 పాయింట్లు పడిపోయి 81,537.70 దగ్గర నిలిచింది. నిఫ్టీ 645.70 పాయింట్లు దిగజారి 25,048.65 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రష్యా, ఇరాన్, వెనెజువెలా, మెక్సికో వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గ్రీన్‌లాండ్‌ను హస్తగతం చేసుకొనేందుకు ఐరోపా దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతుండటం మదుపరులను కలవరపెడుతూ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను సెల్లింగ్ ప్రెషర్‌కు గురిచేస్తున్నది. దీంతో మదుపరులు లాభాల స్వీకరణ దిశగానే వెళ్తే.. సూచీలకు భారీ నష్టాలే అంటున్నారు.
పైగా రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా 92 మార్కు దరిదాపుల్లో ముగియడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గాను ప్రభుత్వ, కార్పొరేట్ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు సైతం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలవనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఒడిదుడుకులకు గురయ్యే వీలున్నది. కాగా, ఎప్పట్లాగే విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు ముఖ్యమని చెప్పుకోవచ్చు.
అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,700 పాయింట్ల స్థాయి కీలకం. దిగువన ముగిస్తే 24,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,300-25,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.