Muhurat Trading | ముంబై, నవంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త సంవత్సరం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)ల్లో నిర్వహించిన మూరత్ ట్రేడింగ్.. సంవత్ 2081కు ఆరంభం పలికింది. ట్రేడర్లు తమ కొత్త ఖాతా పుస్తకాలను తెరవడాన్ని సూచికగా ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను ఏటా జరుపుతారు. ఇక 6 గంటల నుంచి 7 గంటల వరకు గంటపాటు జరిగిన ఈ ట్రేడింగ్‌లో మొదట్లో కనిపించిన ఉత్సాహం చివరిదాకా లేకున్నా.. సూచీలు ఆకర్షణీయ లాభాలనే సొంతం చేసుకున్నాయి. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 335.06 పాయింట్లు లేదా 0.42 శాతం ఎగిసి 79,724.12 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 635 పాయింట్లు ఎగబాకడం గమనార్హం. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి 80,023.75 అవగా, కనిష్ఠం 79,655.55 పాయింట్లు. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్లు లేదా 0.41 శాతం పుంజుకొని 24,304.35 వద్ద నిలిచింది.
బ్యాంకింగ్, ఆటో, చమురు-గ్యాస్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ విలువ అత్యధికంగా 3.29 శాతం పెరిగింది. అక్టోబర్‌లో పెద్ద ఎత్తున జరిగిన వాహన విక్రయాలు సంస్థకు ఇలా కలిసొచ్చింది. ఇక అదానీ పోర్ట్స్ 1.26 శాతం, టాటా మోటర్స్ 1.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.92 శాతం చొప్పున లాభపడ్డాయి. నెస్లే, ఎన్టీపీసీ, రిలయన్స్, ఐటీసీ, టైటాన్, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లూ పెరిగాయి. అయితే హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.69 శాతం, స్మాల్‌క్యాప్ 1.16 శాతం చొప్పున పెరిగాయి. రంగాలవారీగా ఆటో 1.15 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.10 శాతం, చమురు-గ్యాస్ 0.91 శాతం మేర లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. జపాన్, చైనా, దక్షిణ కొరియా సూచీలు నష్టపోగా, హాంకాంగ్ సూచీ మాత్రం లాభపడింది. ఐరోపాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లూ లాభాల్లోనే కదలాడుతున్నాయి. గురువారం విదేశీ సంస్థాగత మదుపరులు రూ.5,813.30 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారని స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి. నాడు సెన్సెక్స్ 553.12 పాయింట్లు, నిఫ్టీ 135.50 పాయింట్లు పడిపోయాయి. గత నెల అక్టోబర్ మొత్తంగా సెన్సెక్స్ 4,910.72 పాయింట్లు లేదా 5.82 శాతం, నిఫ్టీ 1,605.5 పాయింట్లు లేదా 6.22 శాతం దిగజారాయి.
గురువారంతో ముగిసిన సంవత్ 2080.. దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు ఆకర్షణీయ లాభాలనే పంచింది. ఈ ఏడాది కాలంలో సెన్సెక్స్ 14,484.38 పాయింట్లు లేదా 22.31 శాతం పుంజుకున్నది. ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ కూడా రూ.124.42 లక్షల కోట్లు ఎగిసింది. ప్రస్తుతం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,44,71,429.92 కోట్లు (5.29 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నది. ఇక నిఫ్టీ గత ఏడాది కాలంలో 4,780 పాయింట్లు లేదా 24.60 శాతం ఎగబాకింది. బీఎస్ఈ 70వేలు, 80వేల మార్కులను అధిరోహించింది ఈ ఏడాదిలోనే. ఎన్ఎస్ఈ 20వేల మార్కును దాటింది కూడా ఈ సంవత్సరమే. మొత్తానికి తీవ్ర ఒడిదొడుకులు ఎదురైనా.. ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల వర్షాన్నే కురిపించాయి ఈక్విటీ మార్కెట్లు. అయితే విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ ఆ లోటును దేశీయ సంస్థాగత మదుపరులు భర్తీ చేయడం కలిసొచ్చింది.
బీఎస్ఈ వద్ద మూరత్ ట్రేడింగ్‌లో గంట మోగిస్తున్న బెయిన్ క్యాపిటల్ ఇండియా ఎండీ అమిత్ చంద్ర, బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి
దీపావళి పండుగను పురస్కరించుకొని జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఆడిటోరియంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ట్రేడింగ్ చేస్తున్న స్టాక్ ట్రేడర్లు