Stocks | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 885.6 పాయింట్లు (1.08 శాతం) నష్టపోయి 80,982 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 25 వేల స్థాయికి వెళ్లినా 293 పాయింట్లు (1.17శాతం) పతనంతో 24,717 పాయింట్ల వద్ద ముగిసింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధర పెరుగదల, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాల్లో మిస్ అయిన మార్కెట్ వర్గాల అంచనాలు, అమెరికా, ఆసియా మార్కెట్లలో నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లూ నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.56 లక్షల కోట్లు నష్టపోయి రూ.457.06 లక్షల కోట్లకు చేరుకున్నది.
నిఫ్టీ-50లోని 42 స్టాక్స్ నష్టాల్లో స్థిర పడ్డాయి. ఎచిర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ ఐదు శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు, దివిస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్ స్క్రిప్ట్‌లు భారీగా లబ్ధి పోందాయి.
బీఎస్ఈలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, లార్సెన్ అండ్ టర్బో భారీగా నష్టపోగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా లబ్ధి పొందాయి. బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ సెక్టార్ల స్టాక్స్ 2-3 శాతం వరకూ నష్టపోగా ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్ షేర్లు కొంత లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మాతోపాటు ఐదు స్టాక్స్ మాత్రమే లాభ పడ్డాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 1.2 శాతం వరకూ పతనం అయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ మరో జీవిత కాల కనిష్టం రూ.83.75 లకు పడిపోయింది.