Stock market : ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భారతీయ స్టాక్ మార్కెట్‌కు లాభాలపంట పండించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. బుధవారం, ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2,946.32 పాయింట్లు లాభపడి, 77,562.90 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఏకంగా 873.35 పాయింట్లు పెరిగి, 23,997.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఏకంగా ఈ ఒక్కరోజే 4 శాతం లాభాలతో మదుపర్ల సంపద రూ.17.1 లక్ష కోట్ల వరకు పెరిగింది.
దీంతో మొత్తం మార్కెట్ విలువ రూ.445.8 లక్షల కోట్లకు చేరింది. ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్ లాభాల్లోనే నడిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,627.15 కోట్ల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 24,025.15 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గనుండటం వంటి పరిణామాలు మార్కెట్‌కు అనుకూలంగా మారాయి. అలాగే, కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం కూడా కలిసొచ్చింది. ఇండియన్ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఈ రోజు లాభాలబాటపట్టాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 6 శాతం, జపాన్ నిక్కీ 5 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 3 శాతం లాభాపడ్డాయి.
మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ 47 పైసలు పెరిగి, 92.59 వద్ద కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. అంతకుముందు రోజు బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు 109 డాలర్ల వద్ద ఉండగా, బుధవారం భారీగా తగ్గి 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు 16 శాతం పైగా చమురు ధర తగ్గింది. ఔన్స్ బంగారం ధర 4788 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ రోజు షేర్లలో ఇండిగో ఏకంగా పది శాతం మేర లాభాలు పొందింది.