Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారిగా జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 70వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ సైతం 21,026 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు తొలిసారిగా ఆల్‌టైమ్ హైకి చేరుకోవడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 69,925.63 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 70,057.83 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ హైకి చేరగా.. చివరకు 102.93 పాయింట్ల లాభంతో 69,928.53 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం తొలిసారిగా 21,026.10 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 27.70 పాయింట్ల లాభంతో 20,997.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 2,211 షేర్లు పురోగమించగా.. 1358 షేర్లు క్షీణించాయి. 174 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్, రియల్టీ 0.5శాతం నుంచి ఒక్కోశాతం వరకు పెరిగాయి. ఫార్మా ఇండెక్స్ 0.4శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.