Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అత్యధికంగా హెచ్‌సీఎల్, బజాజ్ ఫైనాన్స్ భారీ లాభాలను నమోదు చేశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,198.20 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకొని లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో 83,197.67 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్టంగా 83,754.49 పాయింట్లు పెరిగింది. చివరకు 319.07 పాయింట్లు పెరిగి 83,535.35 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82.05 పాయింట్ల లాభంతో 25,574.35 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 88.71 వద్ద ముగిసింది. దాదాపు 1,787 షేర్లు పుంజుకోగా.. 2,183 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం తగ్గింది. మీడియా మినహా, మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ 1.6 శాతం, ఫార్మా ఇండెక్స్ దాదాపు 1 శాతం, మెటల్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.
నిఫ్టీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో లాభాలను ఆర్జించగా.. ట్రెంట్, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, పవర్ గ్రిడ్, టాటా కన్స్యూమర్ నష్టపోయాయి. యూఎస్ సెనేట్ షట్‌డౌన్‌ను ముగించాలని నిర్ణయించిన తర్వాత సోమవారం యూరప్, ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. ఆదివారం ఆలస్యంగా జరిగిన ఓటింగ్‌లో ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి రాజీ బిల్లును ఆమోదించే ప్రక్రియను సెనేట్ ప్రారంభించింది. అయితే, డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేసి ప్రక్రియను ఆలస్యం చేస్తే తుది ఆమోదం చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. డిసెంబర్ మధ్య నాటికి గడువు ముగిసే ఆరోగ్య సంరక్షణ పన్ను క్రెడిట్‌ను పొడిగించడంపై సెనేట్ ఓటు వేసే అవకాశం ఉంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న షట్‌డౌన్ ముగిసిపోతుందన్న అంచనాల మధ్య ఎస్అండ్పీ500 అంచనాను 0.7 శాతం పెంచాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంచనా 0.1 శాతం పెరిగింది. జర్మనీ డాక్స్ 1.4 శాతం పెరిగి 23,891.71 చేరగా.. పారిస్ సీఏసీ 40 0.9 శాతం పెరిగి 8,024.23.. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ-100 0.5 శాతం పెరిగి 9,729.77కి చేరుకుంది.