Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలతో మార్కెట్లు ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లపై ప్రకటన చేసింది. వరుసగా ఏడోసారి సెంట్రల్ బ్యాంకు రెపోరేటులో మార్పులు చేయలేదు. రెపో రేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటు యధాతథంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈక్విటీ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 74,287.02 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత కోలుకున్నాయి. ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
ప్రారంభంలో 73,946.92 పాయింట్ల గరిష్ఠానికి పతనమైన సెన్సెక్స్.. 74,361.11 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 20.59 పాయింట్ల లాభంతో 74,248.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఉదయం నష్టాల్లో మొదలైంది. చివరకు 0.95 పాయింట్ల నష్టంతో 22,513.70 వద్ద ముగిసింది. మార్కెట్లో దాదాపు 2134 షేర్లు పురోగమించగా, 1353 షేర్లు క్షీణించాయి. 101 షేర్లు మారలేదు. నిఫ్టీలో కోటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ నష్టపోయాయి. సెక్టార్లలో బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ 0.5-1.5 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా 0.4 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం చొప్పున పెరిగాయి.