Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. నిన్న మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నష్టాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 66,071.63 దగ్గర స్వల్ప నష్టాలతో మొదలైంది. ఇంట్రాడేలో 65,865.63 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు సెన్సెక్స్ 78.22 పాయింట్లు పతనమై.. 65,545.47 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 9.80 పాయింట్లు తగ్గి 19,664.70 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో 1,791 షేర్లు పురోగమించగా.. 1,756 షేర్లు క్షీణించాయి. 122 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో బ్యాంక్, ఫార్మా మరియు ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.5 శాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్టాల్గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.