హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ సిస్టం (బెస్) పవర్ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వీటిలో మహేశ్వరంలో 750 మెగావాట్లు, చౌటుప్పల్‌లో 750 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ జీవోను జారీచేసింది. అయితే ట్రాన్స్‌కోకు చెందిన సబ్‌స్టేషన్ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయనుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీవోవో) పద్ధతిలో వీటిని నిర్మించేందుకు సర్కారు అనుమతినిచ్చింది. అంటే వీటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టినట్లే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం వయలిబిటీ గ్రాంట్ కింద రూ. 270 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నది. ఈ ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఈవీజీఎఫ్ను కోల్పోవడంతో పాటు, ట్రాన్స్‌కో స్థలాలు అన్యాక్రాంతం అవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టుల వ్యయాన్ని సర్కారు పెంచింది. రూ. 168.46 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. మాడల్ సోలార్ మండలాలు, గ్రామాలు, అగ్రికల్చర్ పంపుసెట్ల ఏర్పాటుకు గతంలో రూ. 775.01 కోట్లుంటే, తాజాగా రూ. 943.47 కోట్లకు పెంచారు. ప్లాంట్లను ఎత్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, సామర్థ్యాన్ని 5 కిలోవాట్స్ నుంచి 7.5 కిలోవాట్స్ పెంచడంతో అదనపు నిధులు అవసరమేర్పడగా ప్రభు త్వం పరిపాలనా అనుమతులిచ్చింది.