హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఎగుమతులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) గురువారం ఎగుమతుల్లో సవాళ్లపై హైదరాబాద్లోని తమ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సోమేశ్ కుమార్.. ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాల్సిందిగా పారిశ్రామికవేత్తలను కోరారు. గడిచిన ఏడేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా తక్కువ సమయంలోనే పరిస్థితులు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు అభివృద్ధిలో భాగస్వాములని పేర్కొంటూ.. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ లాక్డౌన్లో పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం సహకరించిందని గుర్తుచేశారు.
అయితే కంటెయినర్ల కొరత ఎగుమతులకు ఆటంకంగా మారిందని చెప్పారు. జీఎస్టీ రిఫండ్ అంశంలో కూడా ఇబ్బందులున్నట్లు, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. కాగా, శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఇంటర్నేషనల్ కొరియర్ కార్గో క్లియరెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కంటెయినర్ డిపోను పెట్టాలని, ప్రపంచస్థాయి నాణ్యతతో కూడిన ఎగుమతుల కోసం ఓ స్పెషల్ మెగా ఇండస్ట్రియల్ పార్కును నెలకొల్పాలని సూచించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.