హైదరాబాద్, జనవరి 1: రాష్ర్టానికి చెందిన స్టాండర్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ వచ్చేవారంలో ఐపీవోకి రాబోతున్నది. ఈ నెల 6 నుంచి 8 వరకు మూడు రోజుల వరకు షేర్లను విక్రయించడంతో రూ.410.05 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. షేరు ధరల శ్రేణిని రూ.133-140గా నిర్ణయించింది. ఈ నూతన సంవత్సరంలో ఐపీవోకి వస్తున్న తొలి సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కావడం విశేషం. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నది. గతంలో 1.83 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్నప్పటికీ దీనిని తగ్గించింది.
లాభాల్లో సూచీలు
ముంబై, జనవరి 1: నూతన సంవత్సరం తొలిరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 368.40 పాయింట్లు లాభపడి 78,507.41 వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ 98.10 పాయింట్లు అందుకొని 23,742.90 వద్ద స్థిరపడింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ షేరు 3.26 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా 2.45 శాతం, లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు లాభాల్లో ముగిశాయి.