హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రూ.347 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు.
అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టేర్ యూనిట్లను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అనతి కాలంలోనే తెలంగాణ తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. 2040 నాటికి దేశీయ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆర్థిక సర్వే లెక్క తేల్చినట్టు చెప్పారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకుని రాష్ర్టానికి కొత్త పరిశ్రమలను తీసుకొస్తామన్నారు.