SpiceJet | అయోధ్య (Ayodhya) లో రామాలయం (Ram temple consecration) ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్ (SpiceJet)’ కీలక నిర్ణయం తీసుకున్నది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే వారి కోసం ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసు నడుపనున్నట్లు శుక్రవారం తెలిపింది. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెల 30న అయోధ్యలో మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ- అయోధ్య మధ్య స్పెషల్ విమాన సర్వీసు నడుపుతామని స్పైస్ జెట్ ప్రకటించింది. శ్రీరాముడి భక్తులకు నిరంతరాయ ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు అదే రోజు రిటర్న్ ఫ్లైట్ నడుపుతామని కూడా తెలిపింది.
ఈ నెల 21 మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ సాయంత్రం ఐదు గంటలకు అయోధ్యలో బయలుదేరి 6.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సుమారు 100 చార్టర్డ్ విమానాలు అయోధ్యకు రానున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రకటించారు.