న్యూఢిల్లీ, డిసెంబర్ 19: గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌ను కొనేందుకు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ ఆసక్తి కనబరుస్తున్నది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ ముంబై ఆధారిత ఎయిర్‌లైన్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే గో ఫస్ట్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ)కు తమ ఆసక్తిని తెలియపర్చినట్టు మంగళవారం స్పైస్‌జెట్ వెల్లడించింది. ఓ ప్రణాళికను ఆర్పీకి అందజేసే యోచనలో కూడా ఉన్నట్టు రెగ్యులేటరీకి స్పైస్‌జెట్ చెప్పింది. స్పైస్‌జెట్ కలయికలో గో ఫస్ట్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బలమైన ఎయిర్‌లైన్‌గా నిలబడుతుందన్న విశ్వాసాన్ని కనబర్చింది.
ఏడున్నర నెలలుగా గో ఫస్ట్ విమానాలు ఎగురలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మే 3 నుంచి విమానయాన సేవలకు గో ఫస్ట్ దూరమైంది. ప్రాట్ అండ్ విట్నీ పీడబ్ల్యూ1000జీ ఇంజిన్ సైప్లె సమస్యలు.. గో ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2005 నవంబర్ 4న గో ఫస్ట్ (అప్పట్లో గోఎయిర్) విమాన సేవలు మొదలయ్యాయి. వాదియా గ్రూప్ నిర్వహణలో ఉన్న ఈ సంస్థకు 53 (ఏ320నియో) విమానాలున్నాయి. 2016-17 వరకు లాభాల్లోనే నడిచింది. ఆ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా ప్రభావం సంస్థను మరింతగా కుంగదీసింది. గో ఫస్ట్ నడుపుతున్న ఏ320నియో విమానాలన్నింటికీ ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లే. వీటి సరఫరాలో సమస్యలు కంపెనీ కార్యకలాపాలనే ప్రభావితం చేశాయి. ఈ ఏడాది మే 2న ఎన్సీఎల్టీ ముందు స్వచ్చం ధ దివాలా తీర్మానానికి దరఖాస్తు చేసింది.
స్టాక్ మార్కెట్లలో స్పైస్‌జెట్ షేర్లు మదుపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకానొక దశలో 7.77 శాతం వృద్ధితో రూ.69.20ని చేరింది. ఇది కంపెనీ 52 వారాల గరిష్ఠం కావడం గమనార్హం. అయితే మార్కెట్ ముగిసే సమయానికి ప్రారంభ లాభాలను కోల్పోయి 2.91 శాతం వృద్ధితో రూ.66.08 వద్ద స్థిరపడింది.
భారతీయ విమానయాన పరిశ్రమ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) భారీగా తగ్గవచ్చని ప్రముఖ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఐసీఆర్ఏ మంగళవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.17,000-17,500 కోట్ల నష్టాలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.3,000-5,000 కోట్లుగానే ఉండొచ్చంటున్నది. ఎయిర్‌లైన్స్ లాభాలు పెరగడం, ఖర్చులు మితంగానే ఉండటం కలిసొచ్చే అంశంగా ఓ వెబినార్‌లో పేర్కొన్నది.