Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) స్పీడ్ మిషన్లా దూసుకెళ్తోంది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల బీఎస్ఈ లో ఓలా ఎలక్ట్రిక్ షేర్ మరో 10 శాతం వృద్ధి చెంది 52 వారాల గరిష్ట స్థాయి రూ.146 పలికింది. తద్వారా ఓలా ఎలక్ట్రిక్ షేర్ సోమవారం మో అప్పర్ సర్క్యూట్ ను దాటేసింది. ఈ నెల 9న దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ పేరెంట్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్ 92 శాతం వృద్ధి చెందింది. ఐపీఓ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.76లకే లిస్టయింది.
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, పొజిషనల్ ట్రేడర్ల దన్నుతో ఓలా ఎలక్ట్రిక్ ర్యాలీ కొనసాగింది. ఫలితంగా హెచ్ఎస్ బీసీ టార్గెట్ ప్రైస్ రూ.140 మార్కును ఓలా ఎలక్ట్రిక్ దాటేసింది. సుస్థిర రెగ్యులేటరీ మద్దతు కలిగి ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని హెచ్ఎస్బీసీ తెలిపింది. ఖర్చులు తగ్గించడంతోపాటు బ్యాటరీ వెంచర్లో పాజిటివ్ రిస్క్-రివార్డు ఓలా ఎలక్ట్రిక్ సామర్థ్యంగా ఉంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఐపీఓ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లలో లిస్టయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం రెవెన్యూలో 32శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది ఓలా ఎలక్ట్రిక్. 2023-24తో పోలిస్తే ఈ ఏడాది నికర నష్టం రూ.267 కోట్ల నుంచి రూ.347 కోట్లకు పెరిగింది. మరోవైపు ఇటీవలే ఓలా ఎలక్ట్రిక్.. తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోడ్ స్టర్ (Ola Electric Roadster) సిరీస్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. ఈ సిరీస్ మోటారు సైకిళ్లలో ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster), ఓలా రోడ్‌స్టర్+ (Ola Roadster +), ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ప్రో (Ola Roadster Pro) మోటారు సైకిళ్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.